top of page
MediaFx

పని లేని శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు

కేంద్ర ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి పదవుల కేటాయింపు వ్యవహారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చుక్కలు చూపిస్తోంది. అసమ్మతి జ్వాలలు అంటుకున్నాయి. చురచురమంటూ విస్తరిస్తోన్నాయి. సొంత బలం లేని మోదీ.. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది తేలాల్సి ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది బీజేపీ. 

ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా లభించింది 240 సీట్లు మాత్రమే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అండతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మేజిక్ ఫిగర్ కంటే 20 సీట్లు మాత్రమే అధికంగా లభించిన నేపథ్యంలో టీడీపీ- 16, జేడీయూ- 12 సీట్లు అత్యంత కీలకంగా మారాయి బీజేపీకి. టీడీపీకి చెందిన ఎంపీల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పదవి దక్కింది. ఈ రెండూ కూడా టీడీపీకి విమర్శలను తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యేకించి- రామ్మోహన్ నాయుడికి కేటాయించిన పౌర విమానాయానం. ఈ శాఖ మంత్రికి చేయడానికి పెద్దగా పనేమీ ఉండదు. ఎందుకంటే- కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక్క విమానం కూడా లేదు. విమానాలు లేని పౌర విమానయాన శాఖగా గుర్తింపు ఉంది దీనికి. ఇదివరకు ఎయిరిండియా కేంద్రం ఆధీనంలోఉన్నప్పటికీ.. దాన్ని అమ్మేసింది. 18,000 కోట్ల రూపాయలకు టాటాలు దాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

అప్పటి నుంచి ఈ శాఖ అప్రాధాన్యత కేటగిరి కిందికి వెళ్లిపోయింది. ప్రైవేటు విమానయాన సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించడమే దీని ప్రధాన విధి. పైగా అది చూసుకోవడానికి ప్రత్యేకంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రత్యేకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ శాఖలో పెద్దగా పనులవీ ఉండట్లేదు. అలాంటి శాఖ టీడీపీకి కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్డీఏలో కీలకంగా ఉన్నప్పటికీ చంద్రబాబు తనకు కావాల్సిన ప్రధాన శాఖలను ఇప్పించుకోలేకపోయారని అంటున్నారు. అమరావతిని నిర్మించాల్సి ఉన్నందున పట్టణాభివృద్ధి శాఖ కోసం పట్టుబట్టి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో, శాఖల కేటాయింపులో ఏపీకి తీరని అన్యాయం జరిగిందంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఒకే ఒక పూర్తిస్థాయి మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకొందని ఆరోపించారాయన. ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించినప్పటికీ అవి అలంకారప్రాయమేనని ఎద్దేవా చేశారు. ఏ మాత్రం ప్రయోజనం లేని పౌర విమానయాన శాఖ కేటాయించటం విచారకరమని వ్యాఖ్యానించారు. ఏపీ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. 

bottom of page