top of page
MediaFx

పసిబిడ్డకు పాలిస్తూ.. గొంతు నొక్కి చంపిన తల్లి


ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి చంపింది. (Woman Strangles Newborn To Death) తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నాలుగో కాన్పులో కూడా ఆడ పిల్ల పుట్టడంతో సమాజం నుంచి హేళన భరించలేక పసిపాపను హత్య చేసినట్లు చివరకు ఒప్పుకున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం తెల్లవారుజామున ఫోన్‌ కాల్ వచ్చింది. ఆరు రోజుల బిడ్డ కనిపించడం లేదని 28 ఏళ్ల శివాని ఫిర్యాదు చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిన తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు ఆమె తెలిపింది. గత రాత్రి బిడ్డకు పాలిచ్చి పడుకోబెట్టానని, నిద్ర లేచి చూసేసరికి పక్కన పాప లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అదృశ్యమైన పసి బిడ్డ కోసం పోలీసులు వెతకసాగారు. అయితే కుట్లు తీయడానికి ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులతో శివాని చెప్పింది. ఒకపక్క బిడ్డ కనిపించకపోయినా ఆసుపత్రికి వెళ్తానని ఆ మహిళ అనడంతో పోలీసులు కాస్త అనుమానించారు. అయితే వైద్య పరిస్థితి నేపథ్యంలో ఆమెను అడ్డుకోలేదు.

మరోవైపు అదృశ్యమైన పసిపాప కోసం పోలీసులు వెతికారు. ఎదురింటి రూఫ్‌పై ఒక బ్యాగ్‌ కనిపించింది. దానిని తెరిచి చూడగా పసిపాప అందులో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

కాగా, బిడ్డ తల్లి ప్రవర్తనపై అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీంతో బోరున ఏడ్చిన శివాని, కూతుర్ని తానే చంపినట్లు చెప్పింది. ఈ బిడ్డ నాల్గవ ఆడపిల్ల అని, కాన్పు తర్వాత ఇద్దరు ఆడ పిల్లలు మరణించినట్లు ఆమె తెలిపింది. నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో సమాజం నుంచి హేళన భరించలేక హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత తగిన చర్యలు చేపడతామని పోలీస్‌ అధికారి వెల్లడించారు.

 




bottom of page