టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి క్రికెట్ తో పాటు సినిమాలన్నా చాలా ఇష్టం. అందుకే రిటైరైన తర్వాత ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఒక సినిమా కూడా వచ్చింది.
అదే LGM (లెట్స్ గెట్ మ్యారీడ్). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తెలుగులోనూ నిరాశ ఎదురైంది. అయితే త్వరలో ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో మరొక సినిమా రానుంది. ఈసారి కన్నడ భాషలో ఒక సినిమాను రూపొందించేందుకు రెడీ అయ్యింది ధోని సతీమణి సాక్షి సింగ్. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుందని సమచారం. ఇది విన్న అభిమానులు థ్రిల్ అవుతున్నారు. కాగా గతంలో పోల్చుకుంటే కన్నడ సినిమాల క్రేజ్ కూడా బాగా పెరిగింది. ‘కేజీఎఫ్’, ‘కాంతారా’, ‘777 చార్లీ’, ‘కటేరా’ వంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ఫుల్ అయ్యాయి. దీంతో కన్నడలో సినిమాలు చేసేందుకు పరభాషా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో ధోనీ కన్నడలో ఓ సినిమా నిర్మిస్తున్నాడనే ఆలోచన అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది.ఈ సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు నటిస్తారు? దర్శకుడెవరు తదితర క్యాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఎన్నో ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అతను ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ ధోని కి చివరి ఐపీఎల్ సీజన్ అని కూడా అంటున్నారు. ఐపీఎల్ నుంచి రిటైరయ్యాక సినిమా నిర్మాణంపై ధోని మరింత దృష్టి సారిస్తాడని ప్రచారం సాగుతోంది. దక్షిణాది భాషల్లో సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.