top of page
MediaFx

ఎన్‌-కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున..


హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన N కన్వేషన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి N కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి..కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు. కాగా.. N కన్వేషన్‌ కూల్చివేతపై సినీనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్‌-కన్వెన్షన్ కూల్చడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు. ఎన్‌-కన్వెన్షన్ పట్టా భూమిలో కట్టామని.. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని నాగార్జున పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులపై స్టే కూడా ఇచ్చారన్నారు. ఎలాంటి నోటీసులివ్వకుండా కూల్చడం సరికాదన్నారు. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే నేనే కూల్చేవాడినంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టంచేశారు. ఆ భూమి పట్టా భూమి అని.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు.



bottom of page