top of page
MediaFx

నీట్ కేసులో మరో సంచలనం.. పరీక్షకు ముందు రోజే పేపర్ లీక్!


నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) MBBS కోర్సు ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో పేపర్ లీకేజ్ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 67 మంది ఫస్ట్ ర్యాంక్ రావడం, 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం వివాదాస్పదమైంది. పేపర్ లీక్ అనుమానాలు వ్యక్తం కావడంతో, బిహార్ పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అరెస్టైన విద్యార్థులు పేపర్ లీక్ విషయాన్ని అంగీకరించారు.

దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్ జూనియర్ ఇంజనీర్ సికందర్ యాదవేందు పేపర్ లీక్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ముగ్గురు విద్యార్థులు అనురాగ్ యాదవ్, అమిత్ ఆనంద్, నితీశ్ కుమార్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. అనురాగ్ యాదవ్ తన మామయ్య సికందర్ సహకారంతో పేపర్ లీక్ జరిగిందని అంగీకరించాడు.

ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ బిహార్ పోలీసులని పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించింది. NEET 2024కి 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నాపత్రం ఆలస్యంగా ఇవ్వడంతో అన్యాయం జరిగిందని పలువురు కోర్టుకు వెళ్లారు.

విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ, మోదీ హయాంలో అవినీతి, రిగ్గింగ్ పెరిగిపోయిందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీకేజ్ కుంభకోణాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాని ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

bottom of page