సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో టేస్టీ తేజా కూడా ఒకడు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తన ఆట తీరు, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే అలరించాడు. ఇక బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక తోటి కంటెస్టెంట్స్ తో కలిసి వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు టేస్టీ తేజ. అలాగే కొందరు హీరోలను కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని సార్లు నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురవుతున్నాడు. తాజాగా మరోసారి నెటిజన్ల చేతికి చిక్కాడు టేస్టీ తేజా. సెలబ్రిటీ అయ్యాక కొంచెం బాధ్యతా యుతంగా నడుచుకోవాలంటూ సోషల్ మీడియాలో అతనిని కడిగిపారేస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శనివారం రాత్రి టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో టీమిండియా సౌతాఫ్రికాను7 పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను చూసేందుకు కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయారు. మరికొందరు స్టార్మ్ ఫోన్స్, ల్యాప్ టాప్ లలో మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.
చాలామంది లాగే బిగ్ బాస్ ఫేమ్ టేస్జీ తేజా కూడా టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను చాలా ఆసక్తిగా చూశాడు. అయితే కారు డ్రైవింగ్ చేస్తూ మ్యాచ్ చూడటం ట్రోలింగ్ కు కారణమైంది. తన కారు స్టీరింగ్ మధ్యలో స్మార్ట్ ఫోన్ పెట్టుకుని మ్యాచ్ చూస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు టేస్టీ తేజ. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ అయ్యాక కాస్త బాధ్యతతో నడుచుకో.. అంతగా మ్యాచ్ చూడాలని ఉంటే శుభ్రంగా ఇంటి దగ్గరే చూడచ్చు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘లేకపోతే కారు పక్కకు ఆపుకొని మ్యాచ్ చూడొచ్చు కదా.. ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు మ్యాచ్ చూడడం ఏ మాత్రం సరికాదు’ అంటూ టేస్టీ తేజాపై ఫైరవుతున్నారు నెటిజన్లు.