top of page
MediaFx

అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ..


New Liquor Policy in Andhra Pradesh

నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్‌ పాలసీ, మద్యం షాపులు, బార్లు, లిక్కర్ ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్‌ పేమెంట్‌ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. అలాగే అక్రమ మద్యం నివారణ, డ్రగ్ కంట్రోల్‌పై కూడా అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. ట్రాక్ అండ్ ట్రేస్, డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైనా దృష్టి సారించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఆగస్ట్ 12వ తేదీ లోగా నివేదికలు సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబరు 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.

bottom of page