దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కు కొత్త చీఫ్ నియమితులయ్యారు. సీఐఎస్ఎఫ్ కొత్త చీఫ్ గా నైనా సింగ్ (Nina Singh)ను కేంద్రం నియమించింది.
దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కు కొత్త చీఫ్ నియమితులయ్యారు. సీఐఎస్ఎఫ్ కొత్త చీఫ్ గా నైనా సింగ్ (Nina Singh)ను కేంద్రం నియమించింది. 1989 ఐపీఎస్ బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన నైనా సింగ్ ఈ భద్రతా విభాగానికి నియమితులైన తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా రికార్డు సృష్టించారు. అంతకుముందు ఆమె పౌర హక్కులు, మానవ అక్రమ రవాణా విభాగానికి డీజీగా పనిచేశారు. అలాగే, గతంలో రాజస్థాన్ అత్యున్నత పోలీస్ పదవిని చేపట్టిన తొలి మహిళగా కూడా నైనా సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక ఇండో-టిబెటిన్ సరిహద్దు పోలీస్(ITBP)కు అధిపతిగా వ్యవహరిస్తున్న అనిష్ దయాల్ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
సీఐఎస్ఎఫ్ చీఫ్ గా నియమితులైన నైనా సింగ్ సొంత రాష్ట్రం బిహార్. పట్నా మహిళా కళాశాల, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీపట్టా అందుకున్నారు. నోబెల్ గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుప్లోతో కలిసి నైనా సింగ్ రెండు పరిశోధనాపత్రాలను రాశారు. పోలీస్ స్టేషన్ ల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుపై 2005-2006లో మసాచుసెట్స్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతోనూ నైనా సింగ్ కలిసి పనిచేశారు. ఆరేళ్ల పాటు సీబీఐలో పనిచేసిన ఆమె.. ఆసమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుతో పాటు జియా ఖాన్ ఆత్మహత్య కేసువంటి పలు కీలక కేసులను పర్యవేక్షించారు. 2000 సంవత్సరంలో రాజస్థాన్లో మహిళా కమిషన్ సభ్యకార్యదర్శిగా ఉన్న సమయంలో ఆపదల్లో ఉన్న మహిళల కోసం కమిషన్ సభ్యులు జిల్లాలకు వెళ్లి విచారణ
చేపట్టేలా కొత్త కార్యక్రమాన్ని సైతం రూపొందించారు. తన సేవలకుగాను 2020లో విశిష్ఠ సేవా పురస్కారాన్ని పొందారు. ఆమె భర్త రోహిత్ కుమార్ సింగ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.🚆🌐👮♀️