top of page
MediaFx

ఇకపై డాక్టర్ రామ్ చరణ్..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆర్‌ఆర్ ఆర్‌ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన చెర్రీ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయిపోయాడు.

శనివారం (ఏప్రిల్ 13) తమిళనాడులోని ప్రఖ్యాత వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. విద్యార్థుల మధ్య ఎంతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వేల్స్ యూనివర్శిటీ ప్రతినిధుల నుంచి రామ్ చరణ్ డాక్టరేట్ ను స్వీకరించారు. దీంతో రామ్ చరణ్ కాస్తా డాక్టర్ రామ్ చరణ్ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చిరంజీవి, నాగబాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చరణ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి  హర్షం వ్యక్తం చేశారు. . ఇది తనను ఓ తండ్రిగా ఎమోషనల్ గా, గర్వించేలా చేస్తుందని ఇదో ఉత్తేజకరమైన క్షణమని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మెగాస్టార్. పిల్లలు వారి విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందమన్నారు.ఇక రామ్ చరణ్ కు డాక్టరేట్ ఇవ్వడంపై ఆయన బాబాయ్ నాగబాబు కూడా స్పందించారు. తమిళనాడు కి చెందిన ప్రముఖ ‘వెల్స్ యూనివర్సిటీ ‘రామ్ చరణ్’ ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారన్నారు. పిన్న వయసులోనే ఇలాంటి పురస్కారం అందుకున్నందుకు ఒక కుటుంబ సభ్యుడిగా సంతోషిస్తున్నానని, ఒక తెలుగువాడిగా గర్విస్తున్నానని ట్విట్టర్ తెలిపారు మెగా బ్రదర్. చరణ్ బాబు ఇలాంటి మరెన్నో కీర్తి శిఖరాలని అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు నాగబాబు ఆకాంక్షించారు.


bottom of page