తెలుగు భాషకు, తెలుగు వారికి, తెలుగు సినిమాకు ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ఎన్నో గొప్ప సినిమాలతో ప్రేక్షకులని అలరించి రాజకీయ నాయకుడిగా ప్రజాపాలన చేసి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి, ఎప్పటికి తెలుగువారి గుండెల్లో నిలిచే ఉంటారు. గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న చోట ఘనంగా నిర్వహించారు.
నేడు మే 28న ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా నేడు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి తమ తాతయ్యకు నివాళులు అర్పించారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజున ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారని తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రావడంతో జనాలు గుమిగూడారు. వారితో ఫోటోల కోసం అక్కడికి వచ్చిన అభిమానులు, ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.