సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని.. ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి నటీనటులు కలుల కంటారు. కానీ ఈ రంగుల ప్రపంచంలో విజయాన్ని అందుకోవడం అంత సులభం కాదు. అందం, అభినయం ఎంత ఉన్నా.. అవగింజంత అదృష్టం కూడా ఉండాల్సిందే.
కానీ స్టార్ డమ్ సంపాదించుకుని.. టాప్ హీరోహీరోయిన్లుగా చెలామణి అయినవారు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్లు కొందరు వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అందులో పూజా దద్వాల్ ఒకరు. ఒకప్పుడు సల్మాన్ సరసన ఆడిపాడిన ఆ అందాల తార ఇప్పుడు రూ. 100 కోసం డబ్బా వాలాగా మారింది. అనారోగ్య సమస్యలతో ఒంటరిగా జీవిస్తూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. 1995లో విడుదలైన ‘వీరగతి’ చిత్రంలో సల్మాన్‌ఖాన్ , పూజా దద్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు . ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇద్దరికీ మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత పూజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.పూజ 1977 జనవరి 5న ముంబైలో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే, నటన అంటే ఇష్టం. అందుకే స్కూల్ ఎడ్యుకేషన్‌తో పాటు యాక్టింగ్ పాఠాలు కూడా నేర్చుకుంది. ఒకరోజు యాక్టింగ్ క్లాస్ లో పూజాకి సినిమా ఆఫర్ వచ్చింది. 17 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘వీరగతి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీని తర్వాత పూజా మరికొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు ఆశించిన విజయం దక్కలేదు. సినిమాల్లో సక్సెస్ లేకపోవడంతో పూజా చివరికి బుల్లితెర రంగం వైపు మొగ్గు చూపింది. ‘ఆషికీ’, ‘ఘరానా’ వంటి సీరియల్స్‌లో నటించింది. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి గోవాలో నివసించింది. 2018లో అనారోగ్యానికి గురైంది. ఆమెకు టీబీ సోకిందని వైద్యులు తెలిపారు. దీంతో భర్త, అత్తామామలు ఆమెతో బంధాలు తెంచుకున్నారు. దీంతో ఆమె అనాథగా మారింది.నటుడు రాజేంద్ర సింగ్ పూజకు సహాయం చేసి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో పూజా యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి ఆర్థిక సహాయం కోరింది. దీంతో వెంటనే సల్మాన్ ఖాన్ ఆమెకు సాయం చేశాడు. ఆరు నెలల పాటు పూజా చికిత్స ఖర్చులను భరించాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పూజా ఒంటరిగా ముంబైలోని ఒక చిన్న ఇంట్లో నివసిస్తుంది. 2020లో, ఆమె పంజాబీ చిత్రం ‘శుక్రనా: గురునానక్ దేవ్‌జీ’తో తిరిగి వచ్చింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో పూజ మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం ఆమె డాబా సర్వీస్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. తన స్నేహితుడు డైరెక్టర్ రాజేంద్ర సింగ్ తనకు డాబా సర్వీస్ నడిపేందుకు అవసరమైన వస్తువులను, స్థలాన్ని సమకూర్చాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.