బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ ‘ది గార్డియన్’ తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. 2020 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో ఉన్న 20 మంది ఉగ్రవాదులను భారత్ అంతమొందించిందని ఇందులో పేర్కొంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ‘టార్గెట్ కిల్లింగ్ అనేది భారత విదేశాంగ విధానంలో లేదు’ అని చెప్పారు. ఈ ఆరోపణలు అవాస్తవమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. లష్కరే-తొయిబా నాయకుడు హఫీజ్ సయీద్, పాకిస్తాన్ కుట్రలపై రక్షణ శాఖ నిపుణుడు PK సెహగల్ ఈ మేరకు స్పందించారు.
సెహగల్ ఇంకా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు లక్ష్యంగా వరుస హత్యలు జరుగుతున్నాయి. దీని వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపిస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్లో అంతర్గత నాయకత్వ సంక్షోభం నెలకొంది. పరస్పర ద్వేషం, విభజన నెలకొంది. అన్ని విధాలుగా వైఫల్యం చెందిన పాకిస్థాన్ వారందరినీ వరుసగా మట్టుబెడుతోంది. పాక్‌లో జరుగుతోన్న వరుస ఉగ్ర హత్యల వెనుక పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ హస్తం ఉందని ఆయన అన్నారు.
పాకిస్తాన్ ఈ ఎత్తుగడ వెనుక ఉన్న కారణాన్ని PK సెహగల్ వివరిస్తూ.. పాక్‌లో దాక్కున్న భారత ఉగ్రవాదులను చంపడం ద్వారా, పాకిస్తాన్ దాని స్వంత ఇమేజ్‌ను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. నిజానికి ఉగ్రవాదులను హత్య చేస్తుంది పాకిస్తానీ ఆర్మీ. రెండు-మూడేళ్లలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది. ఒక్క వ్యక్తిని కూడా పట్టుకోలేనంతగా పాకిస్తాన్ గూఢచార సంస్థ బలహీణంగా ఉందా? అని ఎద్దేశా చేశారు. ఎఫ్‌ఏటీఎఫ్ నుంచి తప్పించుకునేందుకు, అంతర్జాతీయ ప్రతిష్టను మెరుగుపరిచేందుకు పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ మాత్రమే ఈ కుట్రకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. హఫీజ్ సయీద్‌పై విషప్రయోగం చేయడం దాదాపు అసాధ్యం. సయీద్‌కు 3-4 అంచెల రక్షణ ఉంది. అలాగే దావూద్ ఇబ్రహీంకు ఏడంచెల భద్రత ఉంది. ఇంతటి పటిష్ఠమైన సెక్యూరిటీలోకి చొచ్చుకెళ్లి విష ప్రయోగం చేసేదెవరు? దీని వెనుక ఐఎస్‌ఐ ఉండాలి. లేదంటే పాక్ ఆర్మీ ప్రమేయం ఉండలి. ఎన్నికల సమయంలో భారత్ ప్రతిష్టను, భారత ప్రధాని ప్రతిష్టను పాక్ దిగజార్చే ప్రయత్నం చేస్తోంది. అందుకే టార్గెట్ కిల్లింగ్ వెనుక భారత్ ప్రమేయం ఉందని కుట్ర పూరిత ప్రచారం చేస్తోంది. ఈ రకంగా పాకిస్థాన్ భారత్ పరువు తీసేందుకు యత్నిస్తోంది. అది కూడా ఎన్నికలు జరగనున్న తరుణంలో.. వారి ఏకైక ప్రయత్నం ఏదో ఒకవిధంగా భారతదేశ ప్రతిష్టపై, ప్రధాని మోడీ ప్రతిష్టపై దాడి చేయడమే. కానీ, ఈ మొత్తం కుట్ర వెనుక పాకిస్థాన్ అసలు పాత్రదారి అని పీకే సెహగల్ పాక్ విషపూరిత కుట్రను బట్టబయలు చేశారు.