ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో పర్యటించారు. పవన్‌కు స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి పరిస్థితుల గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడలోని మత్స్యకార కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరగా కీలక కామెంట్స్ చేశారు. సినిమాల్లో నటించడంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇక పై మూడు నెలలపాటు సినిమా చిత్రీకరణలకు దూరంగా ఉంటానని అన్నారు. వీలున్పప్పుడు ఒకట్రెండు రోజులు షూటింగ్‌కు కేటాయిస్తానని అన్నారు. పవన్ మాట్లాడుతూ.. ‘ నాకు సినిమాలు చేసే టైమ్ ఉందంటారా..? ఇక్కడ కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు నన్ను తిట్టకుండా ఉండాలి కదా. అందుకే ముందు చెప్పిన పని చేయాలి. లేదంటే ‘నిన్ను ఎన్నుకుంటే నువ్వెళ్లి ‘ఓజీ’ చేస్తావా? క్యాజీ’ అంటే అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి. షూటింగ్ విషయంలో క్షమించమని నిర్మాతలను కోరాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానని చెప్పాను. ‘ఓజీ’ సినిమా బాగుంటుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ.. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలు చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇటు రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్స్ తాత్కలికంగా బ్రేక్ పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మూవీస్ నుంచి పవన్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు మేకర్స్. ఈచిత్రాల గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో నటిస్తానని పవన్ చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.