పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంకొక్క సినిమా వస్తే బాగుంటుందిరా.. అజ్ఞాతవాసి లెక్క సరిచేస్తే చాలు.. ఇంకేం అవసరం లేదు.. ఒక్క బ్లాక్‌బస్టర్ కొట్టి పవన్ సినిమాలు చేయకపోయినా పర్లేదు.. బయటికి చెప్పట్లేదు కానీ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కోరిక ఇదే. మరి నిజంగానే పవన్, త్రివిక్రమ్ కాంబో కలుస్తుందా.. ఆ ఛాన్స్ ఉందా..? ఈ సెన్సేషనల్ కాంబోపైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అత్తారింటికి దారేది, జల్సా లాంటి తీపి జ్ఞాపకాలే కాదు.. అజ్ఞాతవాసి లాంటి చేదు నిజం కూడా గుర్తొస్తుంది. ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయిన సినిమా ఇది. అందుకే ఆరేళ్లైనా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇటు పవన్ కళ్యాణ్.. అటు గురూజీ ఫ్యాన్స్. ఒక్క ఫ్లాప్ వచ్చింది కదా అని.. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అంచనాలు తగ్గవు.. నిజం చెప్పాలంటే ఈ కాంబో కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. పవన్‌కు బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్.. ఎలాగైనా బ్లాక్‌బస్టర్ ఇచ్చి ఆ లెక్క సరిచేయాలని చూస్తున్నారు. ఆ మధ్య భీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు గురూజీ. కుదిర్తే పవన్‌తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టం అనుకుంటే.. త్రివిక్రమ్‌తో సినిమా అనేది కలే. కానీ దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత TG విశ్వప్రసాద్. బ్రో సినిమా ఇదే బ్యానర్‌లో వచ్చింది. పవన్, త్రివిక్రమ్‌తో సినిమా చేస్తానంటూ ఎప్పట్నుంచో చెప్తున్నారు విశ్వప్రసాద్. కాస్త కష్టమే కానీ ప్రయత్నిస్తానంటున్నారీయన.
పవన్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఒక్కటే 2024లో రానుంది. ఓజి, ఉస్తాద్ 2025కి వెళ్ళిపోయాయి. పైగా పవన్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సిఎం కూడా. అందుకే ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత అన్నీ కుదిర్తే.. టైమ్ దొరికితే పవన్ చేయబోయే సినిమా త్రివిక్రమ్‌తోనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదే జరిగితే ఫ్యాన్స్‌కు అంతకంటే గుడ్ న్యూస్ మరోటి ఉండదేమో..?