సినిమాల్లో పవర్ స్టార్ గా ఉండే వ్యక్తి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా 'పవర్'స్టార్ గా మారారు. తనతోసహా జనసేన పార్టీ తరఫున పోటీచేసిన 21 మందిని గెలిపించుకొని సంచలన రికార్డు సృష్టించడమే కాదు.. దేశం మొత్తాన్ని తనవైపు చూసుకునేలా చేశారు కొణిదెల పవన్ కల్యాణ్. రాజకీయాల్లో కూడా తమ హీరో రికార్డులు సృష్టిస్తాడనేది దీంతో రుజువైందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, పంచాయితీరాజ్ శాఖలకు మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి సమీక్ష కూడా నిర్వహించారు. మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు తోపాటు కుటుంబ సభ్యులు పలువురు హాజరయ్యారు. మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
అందరూ పవన్ కల్యాణ్ గెలుపును ఆస్వాదించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకాలేదు అనేకన్నా అతన్ని పిలవలేదని చెప్పొచ్చు. మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు కాస్తా ఎన్నికల ప్రచార సమయంలో తీవ్రస్థాయికి చేరాయి. దీనికి కారణం బన్నీ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తన స్నేహితుడు కిషోర్ రెడ్డికి మద్దతు పలకడమే. పవన్ కల్యాణ్ కు ఓ ట్వీట్ తో సరిపెట్టాడు. సామాజిక మాధ్యమాల్లో అల్లు ఆర్మీకి, మెగా అభిమానుల మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది.
ఈ విభేదాలను పక్కనపెట్టాలని పెద్దలు సూచిస్తున్నారు. మెగా అభిమానుల తాకిడి తట్టుకోలేక పుష్ప2 సినిమాను డిసెంబరుకు నిర్మాతలు వాయిదా వేశారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ ను స్వయంగా కలిసి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బన్నీనే స్వయంగా పవన్ ను తోడ్కొని వెళ్లేలా ప్రణాళిక రచించుకునట్లు తెలుస్తోంది.