top of page
MediaFx

"టికెట్ల పంపిణీలో పవన్‌ డిఫరెంట్‌ స్ట్రాటజీ.. జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌!"

రాజకీయ రంగంలో కొత్త వ్యూహాత్మకంగా మార్చి, పవన్ కల్యాణ్ యొక్క జనసేన పార్టీ తమ కోటాలో టీడీపీ సభ్యులకు టికెట్లు ఇచ్చే ఒక అనూహ్య విధానం అమలు చేస్తుంది. టీడీపీతో అంతర్గత విభేదాలు ఉన్న ప్రాంతాల్లో, పవన్ కల్యాణ్ టీడీపీ మాజీ సభ్యులను జనసేన టికెట్లకు ఎంపిక చేస్తున్నారు. అవనిగడ్డ, భీమవరంలో ఈ ఫార్ములాను అమలు చేసిన ఆయన, పాలకొండలో కూడా ఇదే విధానం అమలు చేయబోతున్నారని సమాచారం.

ఎన్డీయే కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన-టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల మార్పుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చే నేతలకు టికెట్లిస్తూ పవన్‌ డిఫరెంట్‌ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. అవనిగడ్డలో టీడీపీ నుంచి జనసేనలోకి మారిన మండలి బుద్ధప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించారు పవన్‌.

భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును జనసేన అభ్యర్థిగా ప్రకటించారు పవన్‌. పవన్‌ కల్యాణ్‌ భీమవరం నుంచి పోటీ చేయాలని మొదటిగా నిర్ణయించినా, సమీకరణాల భాగంగా రామాంజనేయులును పోటీలో నిలబెట్టారు. రామాంజనేయులు 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున భీమవరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో నిలిచిన ఆయన ముక్కోణ పోటీలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా భీమవరం నుంచి పవన్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణ ఇటీవలే పిఠాపురంలో పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. పిఠాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకొండ అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినా ఇంత వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. పార్టీ కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని జయకృష్ణకు సూచించారు పవన్‌. గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పాలకొండ నుంచి మొత్తం ఐదుగురు ఆశావహులు టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో రాజకీయం ఉత్కంఠ భరితంగా మారింది. అయితే నిమ్మక జయకృష్ణకే టికెట్‌ ఖాయమన్న ప్రచారం కూటమి నాయకుల్లో ఉంది.

రైల్వే కోడూరు సీటు మార్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు పవన్‌. యనమల భాస్కర్‌రావుకు బదులుగా ముక్కావారిపల్లె సర్పంచి అరవ శ్రీధర్‌కు సీటు కేటాయించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పవన్‌ ప్రకటించారు. మరోవైపు అధిష్టానం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు జనసేన నేతలు. సీట్ల కోసం పార్టీలు మారిన వారిని ఎలా నెత్తిన పెట్టుకుంటారంటూ మండిపడుతున్నారు. ఇన్నేళ్లు కష్టపడ్డవారిని గుర్తించకుండా పార్టీలు మారిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఫైర్‌ అవుతున్నారు.

జనసేన పోలవరం అభ్యర్థి బాలరాజును మార్చాలని పార్టీ అధిష్టానం యోచిస్తు్న్నట్లు సమాచారం. తాజా సర్వేలు బాలరాజుకు అనుకూలంగా లేవంటూ జనసేన అభ్యర్థిని మార్చే పనిలో పడింది. ఒకవేళ జనసేన టికెట్‌ కేటాయిస్తే… టీడీపీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు సూర్యచంద్రరావు. ఇక, ఎన్నికలు జరిగే మే 13 సమీపిస్తున్న తరుణంలో మార్పులు- చేర్పులు త్వరగా జరగాలని కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు.

bottom of page