పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవర్ క్రేజ్ తప్ప ఇంకేమీ లేదు. ఆర్థిక, అంగ బలం అసలే లేదు. కానీ ఒక్కడిగా అడుగేశాడు. జనసేనికుల ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ పదేళ్ల జనసేన ప్రస్థానంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పవన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. జగన్‌ను నిలదీయడంలో ఎక్కడా రాజీపడలేదు. అన్యాయాన్ని నిలదీయడం, దౌర్జన్యాల్ని ఎదిరించటంతో పవన్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు.
వైఎస్ఆర్‌సీపీ పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా ఎటాక్ చేసింది. ప్రతిరోజు తిట్టని తిట్లు తిట్టి ముప్పేట దాడి చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ పర్సనల్ జీవితంలోకి తొంగి చూశారు. దత్తపుత్రుడని పేరు పెట్టారు. పావలా కల్యాణ్ అంటూ హేళన చేశారు. ప్యాకేజీ స్టార్ అని ఎగతాళిగా మాట్లాడారు. పవన్ షూటింగ్ గ్యాప్‌లో వచ్చి వీకెండ్‌లో డ్రామాలు చేస్తున్నాడని అనరాని మాటలన్నారు. అయినా ఏపీ భవిష్యత్తు కోసం అన్నీ ఓర్చుకున్నానని పవన్ ఎన్నోసార్లు భావోద్వేగానికి గురయ్యారు.
జనసేనాని ఎప్పుడూ పంతాలకు పోలేదు. సీట్ల విషయంలోనూ త్యాగం చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎంత కుట్రలు చేసినా పవన్ తన లైన్ దాటలేదు. "హలో ఏపీ బైబై వైసీపీ" అనే స్లోగన్ జనాల్లోకి తీసుకెళ్లి ఆఖరి పంచ్ ఎలా ఉంటుందో రుచి చూపించాడు.