🌟 తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ సినిమాకు డైరెక్టర్ యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని గూడురు నారాయణ రెడ్డి నిర్మించారు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రజాకార్ సినిమా విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మూవీ ఓ వర్గానా్ని కించపరిచేలా ఉందంటూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) పిటిషన్ దాఖలు చేసింది. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ పిటీషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. తాజాగా ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.
🎥 ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ జారీ చేసిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ సినిమాపై అభ్యంతరం ఉంటే నిపుణుల కమిటీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్ కు సూచించింది. సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ ను సవాలు చేయనందున ఎలాంటి ఉత్తర్వ్యులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. సినిమాటోగ్రాఫీ చట్టం ప్రకారం ప్రత్యామ్నయం ఉందంటూ పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు. దీంతో రజాకార్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇక ఈ సినిమా ముందుగా నిర్ణయించిన తేదీకే విడుదల కాబోతుంది.
📽️ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఇంద్రజ మాట్లాడుతూ.. నారాయణ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారని.. సత్యనారాయణకు దర్శకత్వం కొత్తే అయినా అనుభవం ఉన్న వ్యక్తిగా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు.