top of page
MediaFx

తిహార్‌ జైలు నుంచి కవిత లేఖ..

లిక్కర్‌ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు హైకోర్టులో మరో షాక్‌ తగిలింది. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను హైకోర్టు సమర్థించింది. తన అరెస్ట్, కస్టడీని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని తేల్చి చెప్పింది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు కేజ్రీవాల్‌ తరపు న్యాయవాదులు. ఇక కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్ట్ చేసింది ఈడీ. లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారనేందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతోంది.

మరోవైపు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు.. రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది. ఇదే సమయంలో తిహార్‌ జైలు నుంచి కవిత లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. కోర్టులో చెప్పాలనుకున్న అంశాలను లేఖ రూపంలో రాశారామె. ఈ కేసు ద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దిగజార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను నాలుగుసార్లు విచారణకు హాజరయ్యాననీ, బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని ఆమె ఈ లేఖలో వివరించారు.

దర్యాప్తు సంస్థకు తన ఫోన్లన్నీ అందజేశాననీ, కానీ వాటిని ధ్వంసం చేశానని తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు. 95 శాతం కేసులన్నీ విపక్ష నేతలకు సంబంధించినవేని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందన్నారామె. అలాగే విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కవిత ఈ లేఖలో పేర్కొన్నారు.

bottom of page