top of page
Suresh D

విరాళాల‌ రాబ‌డిలో వైసీపీ ఫ‌స్ట్‌.. టీడీపీ సెకండ్.. జ‌న‌సేన లాస్ట్‌!📋📢

రాజ‌కీయ పార్టీలు సేక‌రించే విరాళాల్లో ఏపీ అధికార పార్టీ వైసీపీ ముందుంది. ఏకంగా వైసీపీకి రూ.68 కోట్లు విరాళాల రూపంలో ఈ పార్టీకి అందాయి. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కేవ‌లం 11.92 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే విరాళాలుగా అందాయి. ఈ వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా వివ‌రించింది.📋📢

2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి అందిన విరాళాలన్నీ గుప్త నిధులేన‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చింది. ఇచ్చిన వారెవరో.. ఎంతెంత ఇచ్చారో తెలియ‌దు. అయితే.. ఎల‌క్టోర‌ల్ బాండ్ల నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు వీరిని ప్ర‌శ్నించ‌లేర‌ని తెలిపింది. గ‌తంలో బీజేపీకి కూడా ఇలానే 520 కోట్ల రూపాయ‌లు విరాళాలుగా రాగా.. కాంగ్రెస్ పార్టీకి 132 కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాజకీయ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను ప్ర‌తి సంవ‌త్స‌రం ఎన్నిక‌ల సంఘానికి సమ‌ర్పించాల్సి ఉంది.

ఈ క్ర‌మంలో గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఆయా పార్టీలు త‌మ‌కు వ‌చ్చిన విరాళాల వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఇచ్చాయి. ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా వైసీపీకి రూ.52 కోట్లు అందాయి. ప్రుడెంట్‌ ట్రస్ట్‌ పేరుతో రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వడం మరో పద్ధతి. ఈ ట్రస్టు ఢిల్లీలో ఉంటుంది. దీనికి డబ్బు చెల్లించి బాండ్ల వంటివి కొనుగోలు చేసి వాటిని రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చు. ఈ మార్గంలో వైసీపీకి రూ.16 కోట్లు అందాయి.

ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీకి ఎలక్టొరల్‌ బాండ్లు, ప్రుడెంట్‌ ట్రస్టు బాండ్ల ద్వారా ఎలాంటి విరాళాలూ అంద‌లేదు. అన్ని విరాళాలు దాతల నుంచి బహిరంగంగా సేక‌రించారు. మొత్తం 193 మంది దాతలు విరాళాలు ఇచ్చారు. వీరిలో టీడీపీ సానుభూతిపరులు, నేతలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నారు. ఏ దాత ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారో వారి పేర్లు, చిరునామాలను కూడా టీడీపీ అందజేసింది. ఇలా 11 కోట్ల 92 ల‌క్ష‌ల రూపాయ‌లు మాత్ర‌మే టీడీపీకి అందాయి. ఇక‌, ఏపీ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యేకంగా విరాళాలు రాలేదు. క‌మ్యూనిస్టు పార్టీల‌కు 2 కోట్ల రూపాయ‌లు, జ‌న‌సేన పార్టీకి అత్యల్పంగా కోటీ 30 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళాలుగా అందాయ‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది.📋📢



bottom of page