బీజేపీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తుంటే.. విపక్షాలు మాత్రం ఎదురుదాడికి దిగాయి. వికసిత్ భారత్ నినాదం 2004ను రిపీట్ చేయడం ఖాయమని విమర్శిస్తున్నాయి. గత పదేళ్లలో మోదీ పేదలకు చేసిందేమీ లేదన్నారు.
అమలు కానీ హామీలపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు కాంగ్రెస్ నేతలు. లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ అంటే.. బీజేపీ 14 కీలక అంశాలను సంకల్ప్‌పత్ర్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది.దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కులాంటిదని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని అన్నారు. దేశంలో 2004 చరిత్ర పునరావృతం కాబోతోందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు.. పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ పదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన బీజేపీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నికల వేడి రాజుకుంది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీజేపీ ఆవిష్కరించిన ఈ సంకల్పపత్రం 400 ప్లస్ టార్గెట్ సాధనలో ఏ మేరకు ఊపయోగపడుతుందో చూడాలి.