ఎన్నికల కమీషన్ ఇచ్చిన తుది నివేదికపై దేశంలోని విపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసిన రోజు ఇచ్చిన గణాంకాలకు అదనంగా దాదాపు 6 శాతం పైగా పోలింగ్ పెంచి ఇవ్వడం మీద సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తొలి దశ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న జరిగాయి. ఆ రోజు రాత్రి 7 గంటల నాటికి దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. అయితే 11 రోజుల తర్వాత ఏప్రిల్ 30న వెల్లడించిన తుది నివేదికలో మాత్రం 66.14 శాతం పోలింగ్ నమోదైనట్టు పేర్కొన్నది.
ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరగగా రాత్రి 7 గంటల వరకు 60.96 పోలింగ్ జరిగిందని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 30న తుది నివేదికలో మాత్రం 66.7 శాతం నమోదైనట్టు వెల్లడించింది. ముందు వెల్లడించిన శాతానికి, తుది నివేదికలో వెల్లడించిన పోలింగ్ శాతానికి ఇంత వ్యత్సాసం ఉండటం అనుమానాలకు గురిచేస్తున్నది.
ఎన్నికల కమీషన్ విడుదల చేసిన పోలింగ్ శాతంలో వ్యత్యాసాలపై అందరూ గొంతెత్తాలని కోరుతూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశాడు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకునేందుకు పోలింగ్ శాతంలో వ్యత్యాసాలపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చాడు. మరి ఓటింగ్ పెరుగుదల వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుంది ? మిగిలిన అయిదు విడతల పోలింగ్ లో ఎన్ని చిత్రాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాలి.