బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు మొక్కి అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని పీకే ఆరోపించారు. బిహార్‌లో జన్ సూరజ్ ప్రచారంలో భాగంగా భాగల్పూర్‌లో జరిగిన సభలో ప్రసంగించిన పీకే, నితీశ్‌పై విమర్శలు గుప్పించారు.
‘‘గతంలో నితీశ్‌తో కలిసి పనిచేసిన నేను ఎందుకు విమర్శలు చేస్తున్నానని చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను ఆయనలా ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టలేను,’’ అని పీకే వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏదైనా చేయాలంటే నితీశ్ ఆదేశించాలన్న విధంగా పరిస్థితేర్పడిందని పీకే అన్నారు. ‘‘నితీశ్ చేతిలో చాలా అధికారం ఉంది. కానీ సీఎం అడిగింది మాత్రం తన పదవి కొనసాగాలని మాత్రమే. బిహార్ యువతకు ఉపాధి కల్పించడం, చక్కెర ఫ్యాక్టరీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అడగలేదు. తన అధికారమే ముఖ్యమని నితీశ్ మోదీకి అమ్మేశాడు,’’ అని పీకే ధ్వజమెత్తారు.
‘‘13 కోట్ల బిహారీల నాయకుడు, గర్వకారణం, నితీశ్ దేశం మొత్తం ముందు మోదీ పాదాలను తాకుతున్నాడు’’ అని కిషోర్ విమర్శించారు. ఇటీవల ఎన్డీయే సమావేశంలో మోదీని ఎన్డీయేపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత నితీశ్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్‌ను చూపించి విమర్శలు గుప్పించారు.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ జేడీయూ కోసం పనిచేసిన కిశోర్, ఆ తర్వాత ఆ పార్టీలో చేరి ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, జేడీయూ సీఏఏ, ఎన్ఆర్సీ మద్దతు ఇవ్వడంతో పీకే విమర్శలు చేశారు. దాంతో జేడీయూ నుంచి తొలగించారు.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే మెజారిటీ సీట్లు గెలుచుకుని మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీకి 240 సీట్లు రావడంతో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లు) మద్దతు కీలకమైంది. బిహర్‌కు ప్రత్యేక హోదా అడగలేదని పీకే ఆరోపించారు.