ప్రధాని మోదీ శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ బయల్దేరి వెళ్తారు. అక్కడ కన్నూర్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ప్రమాద బాధితుల్ని మోదీ పరామర్శించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. కాగా, వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ వయనాడ్ పర్యటకు ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, గత నెల 30వ తేదీన భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో చూరాల్‌మాల్ పట్టణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 417 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10 వేల మందికిపైగా బాధితులు రిలీఫ్ సెంటర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక ఇప్పటికే వయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించిన విషయం తెలిసిందే. తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం బాధితులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు.