రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం చైనా చేరుకున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ మద్దతుగా నిలవాలంటూ రష్యా కోరిన నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పుతిన్ భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో తమ యుద్ధ ప్రయత్నాలకు, యూరప్ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన తమ ఆర్థిక వ్యవస్థకు అన్ని విధాలా అండగా నిలవాలని పుతిన్ కోరనున్నారు.
రష్యా అధ్యక్షుడిగా మార్చిలో తిరిగి ఎన్నికయ్యాక పుతిన్‌కు ఇదే తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం. అయితే గత ఆరు నెలల వ్యవధిలో చైనాకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌లో సైనిక దాడికి వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో చైనాపైనే రష్యా ఎక్కువగా ఆధారపడుతోంది.
పుతిన్‌కు రష్యాలో అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో చైనా అధికారులు ఘనస్వాగతం పలికారు. ‘హానర్ గార్డ్’ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను రష్యా టీవీ ప్రసారం చేసింది. చైనా మీడియా సంస్థ ‘జిన్హువా’ కూడా పుతిన్ రాకను ప్రసారం చేసింది.
కాగా యూరోపియన్ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించిన నాటి నుంచి చైనాతో వాణిజ్య, వ్యాపారాలపై రష్యా ఎక్కువగా ఆధారపడుతోంది. చైనా కస్టమ్స్ గణాంకాల ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన నాటి నుంచి చైనా-రష్యా వాణిజ్యం భారీగా పెరిగింది. ఒక్క 2023లోనే ఇరుదేశాల మధ్య వాణిజ్యం 240 బిలియన్ డాలర్లకు చేరింది. తాజాగా పుతిన్ పర్యటనతో ఈ బంధం మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని ఇరుదేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.