అసెంబ్లీ ఎన్నికల్లో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ… అదే దూకుడుతో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రత్యర్థుల కంటే ముందుగానే… జనరల్ ఎలక్షన్స్ కోసం తొలి అభ్యర్థిని ప్రకటించేసింది. కొడంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్… మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును కోస్గి బహిరంగసభలో ప్రకటించి సంచలనం సృష్టించారు. బీఆర్‌ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించిన రేవంత్… ఆఖరున వంశీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఒక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే 50వేలకు తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 🗳️
తెలంగాణ నుంచే మొదలు.. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో తొలి అభ్యర్థిని ప్రకటించడం వెనక కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో చర్చించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. కానీ, ఇప్పుడు ఓ బహిరంగసభలో వంశీపేరును రేవంత్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే, పార్టీకి యువరక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని.. అగ్రనేత రాహుల్ చాలా రోజులుగా చెబుతున్నారు. ఆ ప్రక్రియను తెలంగాణ నుంచే మొదలెట్టినట్టు కనబడుతోంది. అందుకే.. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా యువనాయకుడు వంశీ పేరును ప్రకటించాలని.. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్‌కు హైకమాండ్ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 🌍
రాహుల్ సూచనలు.. రేవంత్ అమలు! రాహుల్ సూచనలకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి… కాంగ్రెస్‌కు యంగ్ బ్లడ్‌ను ఎక్కిస్తున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అధికారం చేపట్టిన రెండు, మూడు నెలల్లో రేవంత్ చేసిన నియామకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్సీగా బల్మూర్ వెంకట్‌కు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్… రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. తాజాగా, వంశీకి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ లెక్కన.. కాంగ్రెస్‌లో మరింత మంది యంగ్‌లీడర్స్‌కు ఛాన్స్ దక్కబోతోందనే సంకేతాల్ని హైకమాండ్ బలంగానే పంపిస్తోంది. మరి, రాబోయే రోజుల్లో అవకాశం దక్కించుకునే ఆ యువనాయకులు ఎవరనేది చూడాలి. 🌍