టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సుమన్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుమన్ హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో చాలానే సినిమాలు చేశారు. రజినీకాంత్ శివాజీ సినిమాతో విలన్ గా చేయడం స్టార్ట్ చేశారు. రజినీకాంత్ తో ఉన్న అనుబంధంతోనే శివాజీ సినిమాలో విలన్ గా చేసేందుకు సుమన్ అంగీకరించారు. వాళ్లిద్దరి మధ్య ఉండే బాండింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారి రిలేషన్ గురించి స్వయంగా సుమన్ వెల్లడించారు. అలాగే రజినీకాంత్ వ్యక్తిత్వం, ఎలా ఉండేవాలు ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రజినీ అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఆయన నాకు ఒక మోడ్రన్ గురువులాంటి వారు. ఆయనకు మందు తాగే అలవాటు ఉంది. ఆయన తాగేటప్పుడు నన్ను పిలుస్తారు. రెండు గ్లాసులు, మందుబాటిల్, కోక్ ఉంటాయి. ఆయన మందు పోసుకుని నాకు కోక్ పోసిస్తారు. అదేంటని అడిగితే.. నా శరీరం నా ఇష్టం నేను నాశనం చేసుకుంటాను. కానీ, నీ శరీరాన్ని పాడు చేసే హక్కు నాకు లేదు. నువ్వెందుకు నాకోసం నీ ఆరోగ్యం పాడు చేసుకోవాలి. నేను నిన్ను మాట్లాడటానికి పిలిచాను అంటారు. శివాజీ సినిమా షూటింగ్ సమయంలో ఒక విషయం చెప్పారు. మేము క్లమ్యాక్స్ షూట్ ఎంఎస్ రామయ్య కాలేజ్ లో చేస్తున్నాం.
అప్పుడు రజినీకాంత్ నన్ను బిల్డింగ్ మీదకు తీసుకెళ్లారు. దూరంగా ఉన్న ఒక షాప్ ని చూపించారు. అక్కడే నేను మూటలు మోశాను అని చెప్పారు. కండక్టర్ గా చేసిన తర్వాత రాత్రి మూటలు మోసే వాడిని. నా సిగిరెట్లు, మందు ఖర్చుల కోసం ఇలా చేసేవాడిని అని చెప్పారు. ఆయన ఎప్పుడూ తన చుట్టూ ఉండేవారి గురించే ఆలోచించేవారు. తాను ఎప్పుడూ ఎవరికి సహాయం చేశాను, ఎంత సహాయం చేశాను అనే విషయాలను వెల్లడించరు. ఏ సాయమైన గోప్యంగానే ఉంటుంది. ఎవరికైనా సహాయం కావాల్సి ఉందంటే సహాయం చేసేవాళ్లు. కల్యాణమండపానికి పిలిచి పెళ్లిళ్లు చేసేవాళ్లు. ఆయన ఎప్పుడూ ఇన్ సెక్యూరిటీకి లోనుకారు. శివాజీ సినిమాలో నేను ఏదైనా సీన్ లో బాగా చేస్తే.. సుమన్ తినేశావయ్యా.. నాకన్నా బాగా చేశావ్ అని శభాష్ అంటారు” అంటూ రజినీకాంత్ గురించి సుమన్ అనేక కీలకవ్యాఖ్యలు చేశారు.