మెగా ప్రిన్సెస్ క్లింకారా జన్మించి అప్పుడే ఏడాది పూర్తయ్యింది. గతేడాది జూన్ 20న మెగా ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లింకారా రాకతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. అలాగే మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. మెగ్ ప్రిన్సెస్ వచ్చిన ఏడాది మెగా ఇంట్లో అన్ని శుభవార్తలే. అటు చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం.. ఇటు మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం.. అలాగే పదేళ్ల పోరాటం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మేల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం అన్ని క్లింకారా వచ్చిన తర్వాత జరిగాయంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్లింకారా పాప రాకను చూసి మురిసిపోతున్నారు. క్లింకార జన్మించి అప్పుడే ఏడాది పూర్తయ్యింది. ఈరోజు (జూన్ 20న) మెగా ఏంజెల్ ఫస్ట్ బర్త్ డే. ఈ సందర్భంగా రామ్ చరణ్ గారాల పట్టికి నెట్టింట పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నేడు క్లింకారా ఫస్ట్ బర్త్ డే కావడంతో ఎమోషనల్ వీడియో షేర్ చేసింది ఉపాసన. అందులో చరణ్, ఉపాసన ఇద్దరూ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఉపాసన ఫ్యామిలీ.. చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ క్లింకారా గురించి చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల గురించి అడిగేవారని.. పెళ్లైన పదకొండేళ్లైన తర్వాత పాప జన్మించడం సంతోషంగా ఉందని.. తనను ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేనని.. క్లింకార పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు చరణ్. అందులో ప్రెగ్నెన్సీ నుంచి పాప పుట్టిన తర్వాత బారసాల వరకు అందమైన క్షణాలను చూపించారు. ఈ వీడియోనూ షేర్ చేస్తూ క్లింకార రాక తమ జీవితాలలో మరింత సంతోషాన్ని తీసుకువచ్చిందంటూ రాసుకొచ్చింది ఉపాసన. ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ రియాక్ట్ అవుతూ క్లింకారాకు బర్త్ డే విషెస్ తెలిపింది. అలాగే మెగా అభిమానులు రామ్ చరణ్ గారాలపట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే క్లింకార జన్మించి ఏడాది పూర్తైన ఇప్పటివరకు తమ పాప ముఖం చూపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చరణ్, ఉపాసన దంపతులు.