కుడితిలో పడ్డ ఎలుకలా మారింది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఈ ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలై.. అట్టడుగు స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. ముంబై జట్టు రెండు గ్రూప్‌లుగా విడిపోయిందని.. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బుమ్రా, సూర్యకుమార్ ఒకవైపు అయితే.. మిగిలినవారు హార్దిక్ పాండ్యా వెంట, అలాగే ఫ్రాంచైజీ కూడా హార్దిక్‌కు తోడుగా ఉందని.. అటు కెప్టెన్సీ తొలగించడంపై రోహిత్ శర్మ గుస్సాగా ఉండటం లాంటి రూమర్స్ చాలానే వచ్చాయి. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
ప్రస్తుత సీజన్‌లోనే హార్దిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుంచి తొలగించవచ్చని తెలుస్తోంది. ఆఖరిగా పాండ్యాకు రెండు అవకాశాలు ఇవ్వాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురించబడింది. హోం గ్రౌండ్‌లో జరిగే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో(ఏప్రిల్ 7న ఢిల్లీతో, ఏప్రిల్ 11న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు).. ముంబై నెగ్గడంతో పాటు.. వ్యక్తిగతంగానూ రాణించాలని హార్దిక్ పాండ్యాకు షరతు విధించిందట ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. ఇది గనక జరగకపోతే కెప్టెన్సీలో మార్పులు చేస్తామని చెప్పినట్టు సమాచారం. కాగా, తొలి 3 మ్యాచ్‌ల్లో ముంబై ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టులో చేరడంతో.. ముంబైకి వరుస విజయాలు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.