బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణలు, ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన వరుస ఆందోళన.. హింసాత్మకంగా మారుతున్నాయి. దీంతో దేశంలో హింస మరింతగా చెలరేగిపోతోంది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవన్ తన X ఖాతా వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సద్గురు ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. వారికి అండగా నిలువాలి:
ఇక వారికి అండగా నిలువాలని, అలా నిలవని పక్షంలో భారత్ ఏనాటికి మహాభారత్ కాదని సద్గురు స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో భాగమైన ప్రాంతం.. పొరుగు ప్రాంతంగా మారిందని సద్గురు గుర్తు చేశారు. మన నగరికతకు చెందిన వారిని రక్షిచడం మన బాధ్యత అని అన్నారు. బంగ్లాదేశ్‌లోని 27 జిల్లాలోని హిందువుల నివాసాలపై దాడులు జరిగాయని, అలాగే వారి వ్యాపార సంస్థలపైకూడా దాడులు, లూటీలు సైతం జరిగాయని ఎన్నో వార్తలు వస్తున్నాయని తన ఎక్స్ ఖాతాలో సద్గురు పోస్ట్ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా హిందువుల దేవాలయాలు, హిందువుల ఇళ్లపై దాడులు జరిగాయి. దీంతో అందిన కాడికి లూటి చేస్తున్నారు. పొరుగు దేశంలో ఈ తరహా అకృత్యాలు జరగడంపై సద్గురు జగ్గీవాసుదేవ్‌పై విధంగా స్పందించారు. దేశ వ్యాప్త ఆందోళనకు విద్యార్థుల పిలుపు:
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరణలు అమలు చేయాలంటూ దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థులు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు దేశ ప్రజలు సైతం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనలో ఎంతో మంది మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కర్ప్యూ సైతం విధించింది. కానీ కర్ప్యూ సైతం లెక్క చేయని విద్యార్థులు ఆందోళనను తీవ్రతరం చేశారు. అయినా భద్రతా బలగాలు పరిస్థితులను అదుపు చేయలేకపోయింది. దీంతో దేశంలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయి.