సలార్... ఇప్పుడు కేవలం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా! అందులోనూ యాక్షన్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా ఫీవర్ ఒక రేంజ్ అని చెప్పాలి.
అమెరికాలో 'సలార్' బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నార్త్ ఇండియాలోనూ సేల్స్ స్టార్ట్ చేశారు. ఆఖరికి తమిళనాడులో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. చెన్నై సిటీలో తెలుగు షోస్ కూడా షెడ్యూల్ చేశారు. టికెట్స్ అమ్మకాలు ప్రారంభించారు. కానీ, ప్రభాస్ (Prabhas)కు పట్టున్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలో ఇంకా టికెట్స్ అమ్మకాలు ప్రారంభించలేదు. ఎందుకు? అంటే... రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో టికెట్ రేట్స్ పెంచమని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రభాస్ సన్నిహితులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల, ఇంకా బుకింగ్స్ స్టార్ట్ కాలేదు.
'సలార్' టికెట్ రేటును 50 రూపాయల వరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం జీవో రావచ్చు. మరోవైపు తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏది ఏమైనా సరే... ఈ రోజు చర్చలు ముగుస్తాయని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే... రేటు ఎంత పెడతారు? అనేది చూడాలి. 🙏🎥🎫