సమంత.. పరిచయం అక్కర్లేని ఓ సంచలనం. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగులో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులోనే కాదు, తమిళంలోనూ విజయ్, సూర్య, విశాల్ వంటి హీరోలతో నటించి అక్కడ కూడా సక్సెస్ సాధించారు. అలా తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అసలు విషయానికి వస్తే.. సమంత ఐటమ్ సాంగ్ చేసిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అల్లుఅర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా 2022లో విడుదలైంది. పుష్ప విజయంలో 50 శాతం సమంత నటించిన ఊ అంటావా మామ పాట కారణంగానే అని చెప్పవచ్చు. ఆ పాటలో సమంత శృంగార భరిత నటన యువతను గిలిగింతలు పెట్టించింది.
ఆ పాటకు డాన్స్ చేయడానికి సమంతకు రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు, స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అలాంటి సమయంలో పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించవద్దని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారన్నారు. అయితే తాను వారి వ్యతిరేకతను మీరి ఆ పాటలో నటించానని పేర్కొన్నారు.
ఆ పాట పెద్ద టర్నింగ్‌గా మారిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. నిజం చెప్పాలంటే ఆ అవకాశాన్ని కాదనడానికి తన వద్ద సరైన కారణం లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి, తానే తప్పు చేయలేదు అని అన్నారు.