top of page
Suresh D

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా

సమాజంలో ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసి, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితాను టైమ్స్‌ మ్యాగజైన్ ప్రతీ ఏటా విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాదికిగాను తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది.

‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024’ పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో పాటు బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్‌ సైతం చోటు దక్కించుకుంది. వీరితో పాటు నటుడు, డైరెక్టర్‌ దేవ్‌ పటేల్‌ ఉన్నారు. వీరితో పాటు ఈ జాబితాలో అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్‌ జిగర్‌ షా, యేల్‌ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతికశాస్త్రాల ప్రొఫెసర్‌ ప్రియంవదా నటరాజన్‌ చోటు దక్కించుకున్నారు.

అలాగే భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్‌, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ సతీమణి యులియా టైమ్స్‌ మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌ ఆఫ్‌ 2024 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక ఇందులో భాగంగా టైమ్స్‌ మ్యాగజైన్‌ సత్య నాదెళ్లను ప్రస్తావిస్తూ.. ‘ఆయన మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తీవ్ర ప్రభావం చూపుతున్నారు. మానవాళికి అది మంచి విషయం కూడా’ అని టైమ్‌ మేగజీన్‌ పేర్కొంది.

ఇక ఈ జాబితాలో రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కూడా చోటు దక్కించుకుంది. రెగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగిక వేధింపులపై పోరాటానికి రెజ్లర్ సాక్షి మాలిక్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, వినేశా ఫోగట్, బజరంగ్ పూనియాలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.



bottom of page