top of page
MediaFx

స్వయంగా మరమ్మతు చేసుకునేరోడ్లు గోతులకుగుడ్‌బై..!


ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, అక్కడ ప్రజలు మనుగడ సాగించాలంటే రోడ్లు చాలా అవసరం. అవి సక్రమంగా ఉన్నప్పుడే ఆ ప్రాంతానికి రాకపోకలు బాగుంటాయి. ఇతర ప్రదేశాల నుంచి సరుకులు దిగుమతి అవుతాయి. ఇక్కడి నుంచి ఎగుమతులు బాగుంటాయి. రవాణా సౌకర్యాలు పెరిగి తద్వారా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే అక్కడ రోడ్లు చాలా శుభ్రంగా, సాఫీగా ఉంటాయి. కానీ మన దేశంలో అన్నిచోట్లా రోడ్లు సక్రమంగా ఉండవు. గతుకులు, గుంతల రోడ్లపై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

నూతన టెక్నాలజీ..

దేశంలో రోడ్ల పరిస్థితిని మెరుగుపర్చడానికి నేషనల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చడానికి టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. రహదారి నిర్వహణ ఖర్చులను తగ్గించడంతో పాటు దాని జీవిత కాలాన్ని పొడిగించడం దీని ప్రత్యేకత. నూతన టె‍క్నాలజీ, తారును ఉపయోగించి రహదారిని దానికదే బాగుచేసుకునే వీలు కలుగుతుంది.

గోతులతోనే సమస్య..

దేశంలోని రహదారులపై ప్రయాణించేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య గోతులు. వాటిని తప్పించుకుని డ్రైవింగ్‌ చేయడం సవాల్‌తో కూడుకున్న విషయమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారితో అన్ని ప్రాంతాలకూ అనుసంధానం ఉంది. ఈ నేపథ్యంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన గుంతల సమస్యను పరిష్కరించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వినూత్న పరిష్కారాన్ని అన్వేషిస్తోంది .

స్వయంగా మరమ్మతు చేసుకునే టెక్నాలజీ..

కొత్త ఆవిష్కరణ ప్రకారం ఒక రహదారి దానికదే స్వయంగా గోతులను మరమ్మతు చేసుకోగలవు. ఇందుకోసం కొత్త తారు మిశ్రమం వాడతారు. దానిలో స్లీల్ ఫైబర్లు, బిటుమెన్ కలిపి ఉంటాయి. రోడ్డుపై గుంతల కారణంగా గ్యాప్‌ ఏర్పడినప్పుడు, ఆ ఖాళీని పూరించడానికి బిటుమెన్ విస్తరిస్తుంది. స్టీల్‌ ఫైబర్స్ కూడా గుంతలను పూడ్చడంలో సహాయపడతాయి. ఈ టెక్నాలజీలో రోడ్డుపై గుంతలు వాటికవే పూడుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీనివల్ల రహదారి మన్నిక పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి.

గుంతలతో వాహనాలకు నష్టం..

దేశంలో రహదారులపై డ్రైవింగ్ చేసేటప్పుడు గుంతలు పెద్ద సమస్యలను తీసుకువస్తాయి. అలాగే ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటానికి, వాహనాలకు నష్టం కలగడానికి, కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు పరిస్థితి అధ్వానంగా మారుతుంది. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ఈ గోతులను పూడ్చడం కొంచె కష్టంతో కూడుకున్నది. అలాగే సమయం కూడా ఎక్కువవుతుంది.

ప్రయోగాలు చేసే అవకాశం..

రోడ్ల కోసం సెల్ప్‌ రిపేరింగ్‌ మెటీరియల్‌ ( స్వీయ మరమ్మత్తు సామగ్రి)ను ఉపయోగించడం కొత్తది కాదు. దీని గురించి దేశంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. ఈ మెటీరియల్‌ బాగా పనిచేస్తుందా, ఖర్చుకు తగినట్టు ఉంటుందా అనే విషయాలను తెలుసుకోవడానికి ఎన్‌హెచ్‌ఏఐ కొన్ని పరీక్షలు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో సెల్ప్‌ రిపేరింగ్‌ మెటీరియల్‌ కలిగిన జాతీయ రహదారులు ఉండడం మనం అందరికీ గర్వకారణమని చెప్పవచ్చు.

bottom of page