top of page

మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్ల‌నున్న షేక్ హ‌సీనా..

MediaFx

బంగ్లాదేశ్‌లో కొత్త స‌ర్కారు ఎప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే అప్పుడు మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా స్వ‌దేశం వెళ్తుంద‌ని ఆమె కుమారుడు తెలిపారు. ఆందోళ‌నల‌ నేప‌థ్యంలో సోమ‌వారం దేశాన్ని విడిచి హ‌సీనా భార‌త్‌లో ఆశ్ర‌యం పొందిన విష‌యం తెలిసిందే. నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత మొహ‌మ్మ‌ద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న హ‌సీనా కుమారుడు సజీబ్ వాజెద్‌ జాయ్ మాట్లాడుతూ.. త‌న త‌ల్లి ప్ర‌స్తుతం ఇండియాలో ఉన్న‌ద‌ని, ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎప్పుడు కొత్త స‌ర్కారు సిద్ధంగా ఉంటే అప్పుడు ఆమె స్వ‌దేశం వెళ్తుంద‌న్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స‌ర్కారులో హ‌సీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ స‌భ్యులు ఎవ‌రూ లేరు. ప్ర‌స్తుతం హ‌సీనా ఢిల్లీలో ఓ సుర‌క్షిత‌మైన ఇంట్లో ఉంటున్నారు. బ్రిట‌న్‌లో ఆశ్ర‌యం పొందాల‌ని ఆమె భావించినా, ఆమె అభ్య‌ర్థ‌న‌ను ఆ దేశం తిర‌స్క‌రించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ విష‌యం గురించి బ్రిటన్ స‌ర్కారుతో మాట్లాడిన‌ట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ తెలిపారు. అయితే ఆయ‌న పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు.


bottom of page