top of page
MediaFx

దృశ్యం సినిమా రిపీట్..రియల్ లైఫ్‌లో కూడా!

దృశ్యం సినిమా చూశారా. ఆ సినిమాలో హీరో వెంకటేష్ భార్య మీనా పొరపాటున ఓ యువకుడిని హత్య చేస్తుంది. ఆ మృతదేహాన్ని హీరో ఎవరికీ తెలియకుండా కారులో పెట్టి.. ఊరికి దూరంగా ఉన్న ఓ క్వారీలో పడేస్తాడు. చనిపోయిన యువకుడి తల్లి పోలీస్ ఆఫీసర్‌ కావడంతో.. ఎట్టకేలకు ఆ కారును బయటికి తీసి చూడగా.. అందులో మాత్రం శవం కనిపించదు. అయితే ఈ సంఘటనలో మాత్రం రెండు జంట మృతదేహాలకు సంబంధించిన అస్థిపంజరాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ క్వారీ అయితే ఇక్కడ మాత్రం ఓ రిజర్వాయర్. ఆ రిజర్వాయర్‌లో నీరు ఇంకిపోవడంతో కారు బయటికి కనిపించింది. ఆ కారును కాస్తా బయటికి తీయడంతో అందులో రెండు మృతదేహాలు బయటికి వచ్చాయి. వారిద్దరూ బావామరదలు అని పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని ఒక స్టాప్ డ్యామ్‌లో తాజాగా బయటపడిన ఓ కారు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అందులో ఒక వివాహిత, ఆమె బావ మృతదేహాలు వెలికితీయడం స్థానికంగా పెను సంచలనం రేపింది.

ఆ మహిళను 30 ఏళ్ల మిథిలేష్ జాదవ్.. ఆమె బావ 34 ఏళ్ల నీరజ్ సఖ్వార్‌గా గుర్తించారు. గోపి గ్రామంలోని క్వారీ నదిపై నిర్మించిన ఆ స్టాప్ డ్యామ్‌లో స్థానికులు ఓ కారును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కారులో రెండు అస్థిపంజరాలను గుర్తించినట్లు సిహోనియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర గౌర్ తెలిపారు. ప్రతి సంవత్సరం స్టాప్ డ్యామ్‌ను శుభ్రం చేయడానికి నీటిని కిందికి విడుదల చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా నీటిని కిందికి విడుదల చేయడంతో.. ఆ డ్యామ్‌లో నీటిమట్టం తగ్గింది. ఆ కారులో బాగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు.

అయితే మిథిలేష్ జాదవ్‌కు పెళ్లి అయిందని గుర్తించారు. అయితే వీరిద్దరూ ప్రేమించుకోగా.. పారిపోయినట్లు తేల్చారు. మిథిలేష్ జాదవ్ ఫిబ్రవరి 6న ఇంటి నుంచి పారిపోయినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య మిథిలేష్ జాదవ్ మార్కెట్‌కు వెళ్లి.. తిరిగి రాలేదని.. ఆమె భర్త ముఖేష్ సఖ్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తమ బంధువు నీరజ్‌ సఖ్వార్‌తో కలిసి పారిపోయిందని ఫిబ్రవరి 14 వ తేదీన చేసిన ఆ ఫిర్యాదులో తెలిపాడు. ఈ క్రమంలోనే తాజాగా డ్యామ్‌లో వారిద్దరూ శవాలుగా తేలడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారు స్టాప్ డ్యామ్‌లో ఎప్పుడు, ఎలా పడిపోయింది అనే విషయాలతోపాటు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

bottom of page