దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ పద్ధతిలో చాలా సులభంగా పనులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రాకుండానే అన్ని పనులు చేసుకునే వీలు కలిగింది. ముందుగా మనం ఆన్‌లైన్ చెల్లింపు ప్లాట్‌ఫాంలో చేరాలి. దాని ద్వారా లావాదేవీలు జరుపుకోవాలి. ఈ ప్లాట్‌ఫాంలు వివిధ రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ అందజేస్తాయి. వివిధ రకాల ఉత్పత్తులపై తగ్గింపులను, రివార్డులను అందజేస్తాయి. కానీ వీటిలో కొన్ని మోసాలు జరుగుతున్నాయని ఇటీవల సర్వేలో తెలింది.
మోసపోతున్న వినియోగదారులు..
ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాంలు ప్రకటిస్తున్న క్యాష్ బ్యాక్ లు, సబ్‌స్క్రిప్షన్ రివార్డులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని చూసి చాలామంది వాటిలో సభ్యులుగా చేరుతున్నారు. అక్కడ సూచించిన వస్తువులను షాపింగ్ చేస్తున్నారు. కానీ వారికి క్యాష్ బ్యాక్ లు, రివార్డులు రావడం లేదు. ఇలా కొన్ని ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాంలు వినియోగదారులను మోసం చేస్తున్నాయని తెలిసింది. ఆన్‌లైన్ చెల్లింపు ప్లాట్‌ఫాంలు అందించే క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను చూసిన తర్వాత నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నారు. కానీ దానిపై ప్రకటించిన క్యాష్ బ్యాక్ వారికి అందడం లేదని ఇటీవలి సర్వేలో వెల్లడైంది.
13 రకాల పద్ధతులు..
సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీపీపీఏ) 13 రకాల తప్పుదారి పట్టించే ప్రకటనలు, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను వెల్లడించింది. వీటిలో హిడెన్ చార్జీలు, సబ్‌స్క్రిప్షన్ క్యాష్ బ్యాక్‌లు, పాల్స్ అర్జెన్సీ, బాస్కెట్ స్నీకింగ్, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ్ యాక్షన్, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్, ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫరెన్స్, డ్రిప్ ప్రైసింగ్, ట్రిక్ ప్రశ్నలు తదితర విధానాలు ఉన్నట్టు తెలిపింది. వీటి ద్వారా పలువురు వినియోగదారులు మోస పోతున్నట్టు వెల్లడించింది.
సర్వేలో పలు విషయాలు వెల్లడి..
దీనికి సంబంధించి ఇటీవల నిర్వహించిన సర్వేలో దాదాపు 45 వేల మంది తమ అభిప్రాయాలను తెలిపారు. హిడెన్ చార్జీలకు సంబంధించి 52 శాతం మంది సమస్యలు ఎదుర్కొన్నారు. 67 శాతం మంది సబ్‌స్క్రిప్షన్ ట్రాప్ లో పడ్డారు. ఇక మరో మోసపూరిక బైట్ అండ్ స్విచ్ సమస్యను దాదాపు 62 శాతం మంది ఎదుర్కొన్నారు. ఇందులో వినియోగదారులకు అదనపు చెల్లింపులు చేయడం కోసం తరచుగా క్యాష్‌బ్యాక్ పథకాలు అందిస్తారు కానీ ప్రోత్సాహకం ఎప్పుడూ చెల్లించరు.
చట్టవిరుద్ధం..
వినియోగదారులను మోసం చేసే ఈ పద్ధతులు చట్టవిరుద్ధమని 2023 డిసెంబర్ లో భారత ప్రభుత్వం తెలిపింది. ఈ చీకటి పద్ధతుల ద్వారా కస్టమర్ల ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాంలపై రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.