డిజిటల్ షాపింగ్ సంస్థల కోసం భారత్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా అవతరించింది.
బుధవారం విడుదలైన లండన్ అండ్ పార్ట్‌నర్స్ అనాలసిస్ ఆఫ్ డీల్‌రూం.కో ఇన్వెస్ట్‌మెంట్ డాటా వివరాల ప్రకారం గతేడాది భారత్ 22 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. 51 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా (14 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (7 బిలియన్ డాలర్లు) వరుసగా మూడు, నాల్గో స్థానాల్లో నిలిచాయి. కాగా, 2020లో భారత్ 8 బిలియన్ డాలర్ల పెట్టుబడులనే అందుకున్నదని, ఏడాది కాలంలో 175 శాతం వృద్ధి కనిపించిందని తాజా విశ్లేషణలో తేలింది. ఇదిలావుంటే నగరాలవారీగా బెంగళూరు ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం. నిరుడు డిజిటల్ షాపింగ్‌లో 14 బిలియన్ డాలర్ల విలువైన వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు బెంగళూరుకు వచ్చాయి.
టాప్-5లో బెంగళూరు తర్వాత న్యూయార్క్ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్, బెర్లిన్ నగరాలున్నాయి. ఇక 7వ స్థానంలో గురుగ్రామ్, 10వ స్థానంలో ముంబై నిలిచాయి. గురుగ్రామ్ 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను, ముంబై 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందాయి. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్లు వచ్చిపడటంతో ఆన్‌లైన్ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని లండన్ అండ్ పార్ట్‌నర్స్ ఇండియా డైరెక్టర్ హెమిన్ భరూచా అన్నారు. ఫ్యూచర్ యూనికార్న్‌ల విభాగంలోనూ బెంగళూరు సత్తా చాటింది. 19 యూనికార్న్‌లతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో నిలిచింది. 13 యూనికార్న్‌లతో గురుగ్రామ్ 7వ స్థానంలో, 7 యూనికార్న్‌లతో ముంబై 14వ స్థానంలో ఉన్నాయి. కాగా, 2021లో మొత్తం గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ల విలువ 140 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 2020లో ఇది 68 బిలియన్ డాలర్లుగానే ఉండటం గమనార్హం.