👥 మతపరమైన కార్యక్రమంలో పంచిన ప్రసాదం తిని సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. లోనార్‌లోని ఓ గ్రామంలో వారం రోజులుగా హరిణం సప్తా అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మంగళవారం చివరి రోజు కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ పంచిన ప్రసాదం తిని అస్వస్థతకు గురైనట్లు బుల్దానా కలెక్టర్ కిరణ్ పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 500 మందికిపైగా ప్రజలు హాజరైనట్లు చెప్పారు. ప్రసాదం తిన్న తర్వాత వారిలో చాలా మంది కడుపునొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆయన వివరించారు. కాగా, అస్వస్థతకు గురైన వారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, అక్కడ పడకల కొరత ఏర్పడటంతో చాలా మంది రోగులకు ఆసుపత్రి బయట రోడ్డుపైనే వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చెట్లకు కట్టిన తాళ్లపై సెలైన్ బాటిళ్లను అమర్చి బాధితులకు వైద్య సేవలు అందించారు. 🏥