కరోనా కష్టకాలంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా పేదలకు, వలస కార్మకులకు అండగా నిలిచారు నటుడు సోనూసూద్ (Sonu sood). లాక్‌డౌన్ మొత్తం ఆయన సేవలకే అంకితమయ్యారు. మరోసారి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బనవనూరుకు చెందిన దేవికుమారీ (Devikumari) అనే అమ్మాయి చదువుకు కావాల్సిన సాయం అందేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘మా కుటుంబం ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ, నాకు చదువుపై ఎంతో ఆసక్తి ఉంది. ఇంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు నా చదువును మధ్యలోనే నిలిపివేయాలనుకున్నారు. నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధ పడ్డాను. అలాంటి సమయంలో సోనూసూద్ సర్ నాకు అండగా నిలిచారు. నా చదువుకు కావాల్సిన సాయం చేశారు. ఆయన నాకు దేవుడితో సమానం’’ అని దేవి ఆనందం వ్యక్తం చేసింది. సోనూసూద్ ఫొటోకు పాలాభిషేకం చేసింది. ఈ వీడియో షేర్ చేసిన సోనూసూద్.. ‘‘మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్యూ. బాగా చదువుకోండి. కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాం. ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునేలా, ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం. ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.