top of page
MediaFx

త్వరలోనే రోడ్లపైకి రాబోతున్న విమానమంత బస్సు.. ఏకంగా 132 సీట్లు


దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్, గ్యాస్‌తో నడిచే వాహనాల వినియోగమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజలు కూడా ఈ వాహనాలను వినియోగించడంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా దీని వలన పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే.. ప్రజలు ఆరోగ్యంపైనా ఎలాంటి ప్రభావం చూపదు. అయితే.. ఒకప్పుడు మాత్రం పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలతో రైళ్లు , వాహనాలు నడిచేవి. కానీ.. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో.. ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నూతన ఆలోచనలతో ఇంధనాలు లేని వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దానిలో భాగంగా.. దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయి. 10 కాదు.. 20 కాదు.. ఏకంగా.. 132 సీట్లతో కొత్త బస్సులు రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి. 132 సీట్లే కాదు.. ఈ బస్సులోని ప్రత్యేకతలు కూడా వావ్‌ అనిపించేలా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది విమానం మాదిరిగా ఉండే ఓ పెద్ద బస్సు అన్నమాట. ఈ బస్సులో విమానంలో ఉన్నట్లే బస్సు హోస్టస్ ఉంటారు.. ఫుడ్ పెడతారు.. టీ ఇస్తారు.. స్నాక్స్ కూడా ఉంటాయి.. జాతీయ రహదారులపై ఈ బస్సులు అతి త్వరలోనే రోడ్డెక్కబోతున్నాయి. ఈ బిగ్‌ బస్‌కు సంబధించిన ఊహాచిత్రం కూడా ఆకట్టుకుంటోంది.ఇక.. దేశంలో పైలెట్ ప్రాజెక్టు కింద.. టాటా కంపెనీతో కలిసి.. కేంద్ర రవాణా శాఖ ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తుంది. మరో ఏడాది, ఏడాదిన్నరలోనే 132 సీట్లతో బస్సులు రోడ్డెక్కబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారతదేశంలో కాలుష్యం తగ్గించటానికి రవాణా వ్యవస్థలో పలు రకాల మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారాయన. ఈ క్రమంలోనే.. 132 సీట్లతో బిగ్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనికోసం నాగ్‌పూర్‌లో పైలట్‌ ప్రాజెక్టు కొనసాగుతోందని చెప్పారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. ప్రస్తుతం 40 సీట్ల డీజిల్ బస్సు నడపటానికి కిలోమీటర్‌కు 115 రూపాయలు ఖర్చవుతుందని.. అదే ఎలక్ట్రికల్ ఏసీ బస్సు అయితే 41 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ లెక్కన.. 132 సీట్ల బస్సును తీసుకురావటం వల్ల ప్రయాణికుడు టికెట్ ఖర్చు 20 శాతం ఆదా అవుతుందని.. పొల్యూషన్‌కు చెక్‌ పడుతుందని.. ప్రభుత్వాలపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని తెలిపారు.

ప్రస్తుతం మూడు బస్సులు తిరిగే చోట.. ఒక్క బస్సులోనే.. మూడు బస్సుల ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేయొచ్చన్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. విమానం లాంటి సీటింగ్‌, ఏసీ, సీటు ముందు ల్యాప్‌టాప్‌ పెట్టుకొనే సౌకర్యం ఉండాలని సూచించామని.. ఎయిర్‌ హోస్టెస్‌ టైప్‌లో బస్‌ హోస్టెస్‌ ఉంటారన్నారు. మొత్తంగా.. దేశంలో కాలుష్యరహిత రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం అనేక మార్గాలు అన్వేషిస్తోంది. విమానమంత బస్సు త్వరలోనే రోడ్లపై పరుగులు పెట్టబోతోంది.

bottom of page