top of page
MediaFx

ప్రత్యేక హోదాకు టీడీపీ, జేడీయూ పట్టు ! ఇంతకీ ప్రయోజనం ఎంత ?

ఏపీలో ఈసారి ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రక విజయం ఓ ఎత్తయితే కేంద్రంలో చంద్రబాబు, పవన్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని మోడీ దుస్థితి మరో ఎత్తు. దీంతో చంద్రబాబు ఈసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అదే సమయంలో బీహార్ లో మెజార్టీ సీట్లు సాధించిన జేడీయూ సైతం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటోంది. దీంతో మరోసారి జాతీయ స్దాయిలో ప్రత్యేక హోదా తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి ? దీని వల్ల రాష్ట్రానికి లభించే ప్రయోజనాలేంటో చూద్దాం.. 

విభజన హామీల్లో భాగంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా కోసం పదేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రయత్నించినా కేంద్రంలో మోడీ సర్కార్ మాత్రం అంగీకరించలేదు. ఏపీకి ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని చెప్పి తప్పించుకుంది. కానీ ఇప్పుడు ఏపీ, బీహార్ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్ధితి లేకపోవడంతో ప్రత్యేక హోదా డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది. 

మన దేశంలో ఓ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కొన్ని ప్రామాణికాలున్నాయి. ఇందులో సదరు రాష్ట్రం కొండ ప్రాంతాల్లో ఉండటం, జనాభా తక్కువగా ఉండటం లేదా ఉన్న వారిలో ఎక్కువగా గిరిజనులు ఉండటం, దేశ సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉండటం, ఆర్ధిక, మౌలిక సౌకర్యాల పరంగా వెనుకబడి ఉండటం, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అస్థిరంగా ఉండటం వంటి అర్హతలతో ప్రత్యేక హోదా ఇస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల రాష్ట్రాలకు పలు ప్రయోజనాలున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్ర పథకాల విషయంలో 90 శాతం వాటా చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాలకు మాత్రం ఇది 60 నుంచి 75 శాతం మాత్రమే. అలాగే హోదా కలిగిన రాష్ట్రాలకు ఓ ఆర్ధిక సంవత్సరంలో ఖర్చు చేయని నిధులు మురిగిపోవు, కాబట్టి తర్వాత సంవత్సరం వాడుకోవచ్చు.

 అలాగే ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కీలక రాయితీలు ఇస్తారు. కేంద్రం స్థూల బడ్జెట్‌లో 30 శాతం హోదా ఉన్నరాష్ట్రాలకు కేటాయించాలి. దీంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకూ రాయితీలు లభిస్తాయని అంచనా. రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక హోదాకు ప్రత్యేక నిబంధనలు లేవు. రాజ్యాంగంలో లేకపోయినా 1969లో ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం మొదలుపెట్టారు.1969లో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్‌లకు హోదా కల్పించారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ సహా 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా పొందాయి. 14వ ఆర్థిక సంఘం ఈశాన్య, మూడు కొండ ప్రాంతాలకు మినహా మిగిలిన రాష్ట్రాలకు 'ప్రత్యేక కేటగిరీ హోదా'ను రద్దు చేసింది. 

bottom of page