☀️ సూర్యుడిపై మచ్చ.. ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళన
- Shiva YT
- Mar 3, 2024
- 1 min read
🌌 భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ… తొలిసారి జనవరి 18న కనిపించింది… వారం రోజుల క్రితం అది భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు.
తర్వాత ఫిబ్రవరి 24, 26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఆ మచ్చ సైజు అమాంతంగా పెరిగిపోయింది. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు AR3590. AR అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ AR3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం… భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. 🌌