అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) సూపర్ బగ్‌గా పిలిచే 'ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మూసి ఉండే వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుందని, ఇది బహుళ ఔషధాలను నిరోధించ గలిగే శక్తిమంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో దీనిని 'సూపర్ బగ్' అని పిలుస్తుంటారని, శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వ్యోమగాములు చిక్కుల్లో
ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఎనిమిది మంది సిబ్బంది ఈ సూపర్ బగ్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సునీతా విలియమ్స్, బారీ యూజీన్ వ్యోమగామి జూన్ 6, 2024న ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. మిగతా ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. ఈ ‘స్పేస్ బగ్స్’ భూమి నుంచి వ్యోమగాముల ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేరాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
భారతీయుడి సారధ్యంలో పరిశోధనలు
అంతరిక్ష కేంద్రంలో పనిచేసే వ్యోమగాములు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తారు. సంప్రదాయ వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటారు కాబట్టి, వ్యోమగాముల ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని అంచనా వేసే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారధ్యంలో నాసా ‘జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ’లో జరుగుతున్నాయి. చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో మెరైన్ మైక్రోబయాలజీ చదివిన ఆయన, 2023లో ‘కలామిల్లా పియర్సోని’ అనే కొత్త మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ బగ్‌ని కనుగొన్నారు.