top of page
MediaFx

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు..


ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయ స్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. SC వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ జరిగింది. వర్గీకరణ సమర్థనీయమేనని నాడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు.. ఇవాళ నిర్ణయాన్ని వెల్లడించింది.. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పును వెల్లడించింది.. దీనివవల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదని.. CJI చంద్రచూడ్‌ పేర్కొన్నారు. వర్గీకరణతో ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదు.. వర్గీకరణ అనేది ఆర్టికల్‌ 341/2కి ఉల్లంఘన కాదు .. ఆర్టికల్‌ 15, 16లో వర్గీకరణ వ్యతిరేకించే అంశాలూ లేవని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రిమీలేయర్‌ను గుర్తించడానికి రాష్ట్రాలు.. ఒక నిర్దిష్టమైన విధానాలు తీసుకురావాలని.. జస్టిస్‌ గవాయ్‌ పేర్కొన్నారు.  కాగా..వర్గీకరణపై ‘EV చెన్నయ్య Vs స్టేట్ ఆఫ్‌ ఏపీ’ కేసులో.. 2 దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కకుపెట్టింది. కోటాలో సబ్‌కోటాపై సుదీర్ఘకాలంగా కోర్టులో కేసులు ఉన్నాయి.. ఈ క్రమంలో ఉవవర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ సుప్రీంను ఆశ్రయించింది.. పంజాబ్ ప్రభుత్వం సైతం వర్గీకరణపై సుప్రీంలో కేసు వేసింది.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంలో 3 రోజులు సుదీర్ఘ వాదనలు సైతం జరిగాయి. ఇదిలాఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ సైతం వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, సుప్రీం కోర్టులో కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నాడు ప్రధాని మోదీ అన్నారు.





bottom of page