సూర్యకు గాయం.. దులీప్ ట్రోఫీకి దూరమైనట్టే..?
- MediaFx
- Aug 31, 2024
- 1 min read
టెస్టు జట్టులోకి రావాలనుకున్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కు నిరీక్షణ తప్పేలా లేదు. ముంబై తరఫున బుచ్చిబాబు టోర్నమెంట్ (Buchi Babu)లో ఆడుతున్న ఈ మిస్టర్ 360 అనూహ్యంగా గాయడపడ్డాడు. దాంతో, త్వరలో జరుగబోయే దులీప్ ట్రోఫీ (Duleep Trophy)కి సూర్య అందుబాటులో ఉండడం కష్టమే అనిపిస్తోంది. తమిళనాడు జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మూడో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య కుడి చేతికి గాయమైంద. దాంతో, అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతో సూర్య నాలుగో రోజు బ్యాటింగ్‌కు రాలేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో ముంబై 286 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పటికే రవీంద్ర జడేజా, పేసర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు గాయం కారణంగా దులీప్ ట్రోఫీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు వీళ్ల జాబితాలో సూర్య చేరే అవకాశముంది. అదే జరిగితే మళ్లీ టెస్టులు ఆడాలనుకున్న అతడి కల చెదిరినట్టే. సెప్టెంబర్ 3 నుంచి అనంతపూర్‌లో ఈ టోర్నీ మొదలవ్వనుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సూర్యకు మంచి రికార్డే ఉంది. 137 ఇన్నింగ్స్‌ల్లో ఈ చిచ్చరపిడుగు ఏకంగా 14 సెంచరీలు, 29 అర్ధ శతకాలు బాదేశాడు. మొత్తంగా 63.74 స్ట్రయిక్ రేటుతో అతడు 5,628 పరుగులు సాధించాడు. దాంతో, మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌లో సత్తా చాటేందుకు సూర్య ఆతృతగా ఉన్నాడు. ఒకవేళ బుచ్చిబాబు టోర్నీలో దంచికొట్టాడంటే మళ్లీ టెస్టు జెర్సీ వేసుకొనే అవకాశముంది. అయితే.. ఇప్పటికే వన్డేల్లో తేలిపోతున్న సూర్యనిరుడు స్వదేశంలో బోర్డర్ – గవాస్కర్ (Border – Gavaskar) ట్రోఫీకి ఎంపికయ్యాడు. కానీ, పేలవైమన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులతో ఉసూరుమనిపించి జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక భారత కెప్టెన్సీ విషయానికొస్తే తొలి టీ20 సిరీస్‌లోనూ సూర్య హిట్ కొట్టాడు. శ్రీలంక గడ్డపై 3-0తో భారత్‌కు పొట్టి సిరీస్ అందించాడు.