తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించినరాతపరీక్షల తుది ఎంపిక ఫలితాలను ఆదివారం (ఫిబ్రవరి 25) నియామక బోర్డు విడుదల చేయనుంది. జూనియర్ కాలేజీల్లో 1,924 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపక పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ఈ నెల రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ధ్రువ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు సైతం నిర్వహించింది. దీంతో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలు వెల్లడించేందుకు సర్వం సిద్ధం చేసింది. దివ్యాంగుల కేటగిరీలో అర్హత పొందిన అభ్యర్థులకు రెండు రోజుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి ఫలితాలు ప్రకటించాలని బోర్డు భావిస్తోంది. 📋
మరోసారి ధ్రువీకరణ పత్రాల పరిశీలన డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన, డెమో తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యార్హతలను గురుకుల నియామక బోర్డు 1:2 నిష్పత్తిలో మరోసారి పరిశీలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. అభ్యర్థి స్థానికత, కుల ధ్రువీకరణ, పీజీ, సెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, నోటిఫికేషన్ తేదీ నాటికి విద్యార్హతలన్నీ సాధించారా? లేదా? అనే వివరాలను గత రెండు రోజుల్లో బోర్డు బృందాలు పరిశీలించాయి. ఆదివారం మధ్యాహ్నానికి తుది ఎంపిక జాబితాలను బోర్డు వెల్లడించనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
టీఎస్పీయస్సీ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుకలు ఈ నెల 23న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చి 14తో ముగియనుంది. గతేడాది డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కొత్తగా ఓటీఆర్ నమోదు చేసుకుని, దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్తగా ఇతర కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ఓటీఆర్‌ను అప్‌డేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వెబ్‌లింకును వెబ్‌సైట్లో టీఎస్‌పీఎస్సీ పొందుపరిచింది. కాగా 2022లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. తాజా నోటిఫికేషన్‌కు 4.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 📑