ఎండకాలం వచ్చేసింది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇంకో వారం రోజుల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికైనా టూర్ వెళ్లేందుకు ప్లాన్స్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం బెస్ట్ టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. తెలంగాణ టూరిజం అందిస్తోన్న బెస్ట్ టూర్ ప్యాకేజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.✨🏕️
హైదరాబాద్ నుంచి కేవలం రెండు రాత్రుళ్లు, మూడు రోజులు ప్యాకేజీతో భద్రాచలం టూర్‌ను తెలంగాణ టూరిజం అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా భద్రాచలం ఆలయంతో పాటు, పాపికొండలు వీక్షించవచ్చు. మండుటెండల్లో చల్లటి ప్రకృతి రమణీయత మధ్య ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ టూర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ఛార్జీలు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
టూర్ ఇలా సాగుతుంది..
* ప్రతీ వారంతం (శుక్రవారం) ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. శుక్రవారం రోజు సాయంత్రం 7.30 గంటలకు IRO-పర్యాటక్ భవన్ నుంచి నాన్ ఏసీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం చేరుకుటుంది. ఇక అక్కడి నుంచి మొదలయ్యే జర్నీ రాత్రంతా కొనసాగి భద్రాచలం చేరుకుంటుంది. దారి మధ్యలోనే డిన్నర్ చేయాల్సి ఉంటుంది.
* రెండో రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హరితా హోటల్‌కు చేరుకుంటారు. అనంతరం ఫ్రెష్‌అప్ అయ్యాక 8 గంటలకు పాపికొండలు వీక్షించేందుకు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బోట్ జర్నీ ప్రారంభమవుతుంది. లంచ్, సాయంత్రం స్నాక్స్ బోట్‌లోనే అందిస్తారు. తిరిగి సాయంత్రానికి భద్రాచాలం చేరుకుంటారు. సాయంత్రం దర్శనం చేసుకోవాలనుకునే వారు చేసుకోవచ్చు.
* ఇక మూడో రోజు ఉయదం బ్రేక్ ఫాస్ట్ చేయగానే ఆలయ దర్శనం ఉంటుంది. అది పూర్తికాగానే పర్ణశాల సందర్శన ఉంటుంది. పర్ణశాల సందర్శన పూర్తికాగానే..తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ లంచ్ పూర్తికాగానే హైదరాబాద్ తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ఛార్జీల వివరాలు..
ప్యాకేజీ ఛార్జలీ వివరాలకొస్తే పెద్దలకు ఒక్కొక్కరి రూ. 6,999కాగా చిన్నారులకు రూ. 5,599గా నిర్ణయించారు. ఇందులోనే నాన్ ఏసీ ప్రయాణం, నాన్ ఏసీ అకామిడేషన్ ఉంటుంది. నాన్‌ఏసీలో బోట్‌తో పాటు అందులోనే ఫుడ్ అందిస్తారు. మిగతా చోట్ల ఫుడ్ ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 1800-425-46464 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.