అమరజీవి పొట్టి శ్రీరాముల పేరుతో ఉన్న తెలుగు యూనివర్శిటీ పేరు మార్చడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టేందుకు అంగీకారమే అన్న ఆయన... అయితే సభలో ఉన్న వాళ్లంతా అంగీకరిస్తేనే పేరు మార్పుపై ముందుకెళ్తామన్నారు. సభలో ముఖ్యమంత్రి ఏం ప్రకటించారంటే"బహుముఖ ప్రజ్ఞాశీలిగా పేరు ఉన్న సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ మాట ఇచ్చారు. ఆ విషయం గురించి ఆలోచించాలని సురవరం సుధాకర్‌రెడ్డి సభకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న సభ్యులకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరు ఉంది. ఇప్పుడే టీఎస్‌ను టీజీగా మారిస్తే చాలా మంది అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారితే ఎలా అని అంటున్నారు. ప్రతాప్‌రెడ్డిపై కాంగ్రెస్కు ఎలాంటి భిన్న అభిప్రాయం లేదు. ఆయన సేవలను కూడా గుర్తించడానికి సందేహం లేదు. ఆయన రచనలు, ఆయన స్థాపించిన గోల్కొండ పత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. సభలో అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తే పేరు మార్చడానికి సురవరం ప్రతాప్‌రెడ్డి పెట్టడానికి మాకు ఎలాంటి అభిప్రాయం లేదు." అని సభలో ప్రకటించారు.
దీనిపై మాట్లాడిన వివిధ పక్షాలు అందుకు అంగీకరించాయి. పేరు మార్చడానికి తమకి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశాయి.