కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని విద్యార్థులను కళాశాలలోకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని వార్త గురువారం అర్ధరాత్రి సంచలనం సృష్టించింది. గర్ల్స్ హాస్టల్‌లో ఉండే ఓ విద్యార్థిని సాయంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి హాస్టల్‌లోని వాష్‌రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వారికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని అనుమానితుల నుంచి లాప్‌టాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఎలాంటి ఆధారాలు లభించలేదని కృష్ణా జిల్లా ఎస్పీ తెలపడం గమనార్హం. కాగా, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.